మా ఊరి మంచినీళ్ల బావి..!

     


         మా ఊరి మంచినీళ్ల బావి ఓ లోతైన దిగుడు బావి. ఊరందరికీ దాహం తీర్చే దిగులు లేని బావి. రోళ్లు పగిలే రోహిణి కార్తెలోనూ మా ఊరి మంచినీళ్ల బావి జల కలిమితో భూమి పొరల్లోంచి ఊటతో నీటలక్ష్మీ నివాసంలా ఉండేది. ప్రతి ఇంటింటిలో దిగుడు బావిలోని నీటలక్ష్మీ పొంగి పొర్లేది.

పోనుపోనూ రోజులు గడిచే కొద్ది మంచినీళ్ల బావిలో కల్మషం లేని స్వచ్ఛమైన నీటలక్ష్మీని కలుషితం చేసి మలినం చేశారు. ఆ మలినం వల్ల ఊరి జనాలకు "నారపుండ్లు" అవ్వడం వల్ల జనాలంతా భయాందోళనకు గురయ్యారు. మంచినీళ్ల బావి కలుషితం వల్లే ఈ "నారపుండ్లు" ఏర్పడ్డాయని ప్రజలంతా అప్రమత్తం అవ్వడం గమనార్హం. అప్పటి పెద్దల మేధాశక్తి ఇప్పటి వందల శాస్త్రవేత్తలతో సమానం.

ఎట్టకేలకు ఊరి పెద్ద మనిషి రెడ్డి స్థానంలో ఉండి గొప్ప మనసుతో నారపుండ్ల నుండి ప్రజలకు విముక్తిని కలిగించి అంతటి లోతైన దిగుడు బావిని కాస్త సేదర బావిగా గిలకల సహాయంతో నీటిని తోడుకునేలా ఏర్పరచిన మహానుభావుడు "చిన్న రెడ్డి అలియాస్ విష్ణు వర్ధన రెడ్డి". రెడ్డి మనసు వెన్నా, జనుల మంచిని కోరే మనసులో మిన్నా...

పెళ్లి పిలుపో,

తప్పిపోయిన కట్టుగొయ్యలు వెతుక్కుంటూనో

ఎండనబడి వచ్చిన పొరుగూరి చుట్టమో

ఏ పరాయి మనిషో వచ్చినపుడు ఓ చెంబు నీళ్లు ఇస్తే చాలు కదా..!

"పొరుగూరి మడుసులు మా ఊరొస్తే కూడెందుకు సామి పాణం నిలిపేందుకు మీ ఊరి మంచినీళ్ల బావిలో ఓ దోసెడు నీళ్లు తాగితే శాలనేటోళ్లు"...

ఒకప్పుడు మా ఊరి గొప్పకు, గర్వకారణానికి మంచినీళ్ల బావే. గట్టిగా చెప్పాలంటే మా ఊరికి సగం ఊపిరి మంచినీళ్ల బావి... 

నేను పిల్లోడుగున్నప్పుడు మా తాత సెప్పేటోడు

   ఇంట్లో మడుసులకు, దొడ్లో గొడ్లకే కాదురా

మిట్ట మధ్యాహ్నం నిప్పుల సూరీడు దప్పిక తీర్సుకునేది కూడా మంచినీళ్ల బావిలోనే...

మలిసందెల నిండు చందురుడు నులెచ్చన కోసం తిష్ట వేసుకుని కూసునేది కూడా మన మంచినీళ్ల బావిలోనే అని సెప్పేటోడు...

గూట్లో పిట్టలూ, ఎండాకాలం పైరగాల్లో ఆదమరచి నిదరపోయేటప్పుడు నింగి చుక్కలు నేలమీదకు దిగతాయి. వానైనా, వరసైనా మంచినీళ్ల బావిలోనే తానమాడిపోతాయి. అందుకేరా మన ఊరి మంచినీళ్ల బావిలోని నీటికి అంతటి తళుకూ ఆ మెరుపూ అనేటోడు సక్కటి సిరునవ్వుతో...

మూడు పదుల ముందు కాలంలో మన ఊరి మంచినీళ్ల బావి గిలకల సప్పుడు "హైలెస్సా హైలెస్సా హైలెస్సో" అనే ధ్వని మా గుండెల ధ్వనిని తాకేలా ఉండేది. అంతటి లోతైన మంచినీళ్ల బావిలో బిందెకు చిరుముడి వేసి గిలకల ద్వారా టెంకాయ తాడుతో వదిలి నాలుగు సార్లు బిందెను నీటిలో తానమాడిస్తే బిందె నిండిన తర్వాత ఓ ఊపులో గిలకలు గిర్రుమనేలా బిందెను పైకి లాగి నీటిని దోసిళ్లతో నోట్లో పోసుకుంటే "అమృతమే".

చూస్తూ చూస్తుండగానే కళ్లముందే మా ఊరి మంచినీళ్ల బావి నీటిని తాగే నాథుడే కరువయ్యాడు. ఊటపట్టిన మంచినీళ్ల బావిలో ఉంది కొబ్బరి నీళ్లు కాదు, కటిక పాచితో పేరుకుపోయి తాగడానికి పనికి రాకుండా మారిన సేదర బావి ఆవేదనతో సెబుతున్నా...

మంచినీళ్ల బావి లోపల ఈదులాడేది తాతల తరం నాటి తాబేళ్లు కాదు, 

తాటిబుర్రలూ

తాగిపారేసిన సీసాలూ

సిగరెట్ల పెట్టలూ

పాలిథిన్ కవర్లు

ప్లాస్టిక్ వ్యర్థాలూ...

ఊర్లో ఎన్ని బావులున్నా మంచినీళ్ల బావి జనాల హృదయంలో చెరగని ముద్ర వేసుకుంది కానీ ఆ ముద్ర చెరిగిపోతుందేమోనని భయంగా ఉంది. పోనుపోనూ మంచినీళ్ల బావి కాస్త చెత్తకుండి బావిగా మారిపోతుందేమోనని ఆందోళనగా ఉంది...

సాగిపోతున్న మంచినీళ్ల బావిలోని సెలయేటిపై

ఆగిపోయి కదలలేని నా చూపుల్లోంచి ఏవో భాష్యాలు జనిస్తున్నాయి... 

ప్రజలందరి ముందు కలకలం రేపినా 

మంచినీళ్ల బావి యందు హాలాహలం రేగినా 

కాలంలా నీటి ప్రవాహం అలా సాగిపోతూనే ఉంది ఎందుకు పనికి రాకుండా... 


"మంచినీళ్ల బావి యొక్క మదిలోని మనోభావం"..!

నా నీళ్లలో సగం దిగిన సూర్యబింబం

మానవ జీవనగమన ప్రతిబింబం

అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించమని వేడుకోమంటున్నా...


జరిగే సత్యాల్ని అలల భాషలో చెప్తూ

మరిగే బాధల్ని నీటిలో నురగలుగా చూపిస్తూ

బావి గడ్డున నన్ను మరుస్తుంటా

కోటి భావాలతో "మంచినీళ్ల బావి"ని వాడుకోమని అర్థిస్తుంటా... 🙏

                             మీ, 

                    వన్నూరప్ప... ✍️

Comments

Popular posts from this blog

మా గొప్ప దేవుడు

ఓ రోజు రాత్రి..!

"అన్నింటికన్నా ప్రమాదకరం" ఏంటంటే..!