మా గొప్ప దేవుడు


 శ్రీ శ్రీ శ్రీ హజరత్ వన్నూరు స్వామి తాత పుట్టుపూర్వోత్తరాల గురించి ఈ తరానికి తెలియజేయాలని నా ఓ చిన్న తాపత్రయంతో మీ ముందుకు తీసుకొచ్చాను. పూర్తిగా చదివి పది మందికి తెలియజేయాలని మనఃపూర్వకముగా కోరుకుంటూ కాదు కాదు ఆశిస్తూ... 🙏


         🙏నా కలానికి శక్తినివ్వు తాత🙏


శ్రీ శ్రీ శ్రీ హజరత్ వన్నూరు తాత గొప్ప మహిమగల్లా తాత. కరివేముల గ్రామానికి, గ్రామ ప్రజలకు నేనున్నానని కోరిన కోర్కెలన్నీ కొంగు బంగారమల్లే కష్టాల్ని, కన్నీళ్లను మహిమగల తాత భరించి సుఖసంతోషాలనందించిన మా ఊరి దేవుడు, మాగొప్ప దేవుడు... 🙏


దేవుడంటే విశ్వం, విశ్వమంటేనే దేవుడని పాంథీయిజంలో నాస్తికులకు నొక్కి పెట్టి మరీ అస్తిత్వాన్ని ఋజువుచేసింది "పాంథీయిజం". మనం డైవర్ట్ అవ్వకుండా టాపిక్ లోకి వచ్చేద్దాం. ఎందుకంటే! ఏళ్ల తరబడి వాదించినా అది ఒడవని ముచ్చట గనుక. గందుకే మనం మన టాపిక్ లోనే పరకాయ ప్రవేశం చేద్దాం. ఎక్కడున్నాం మనం ఆ...దేవుడంటేనే జీవుడు, జీవాన్ని సృష్టించేవాడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడనీ... 


      ఇప్పుడు శ్రీ శ్రీ శ్రీ హజరత్ వన్నూరు స్వామి తాత నిజ జీవితంలోకి వెళ్దాం..! 

           దూదెకొండలో జన్మించి, పెరిగి పెద్దయ్యాడు. వన్నూరు తాత బంధువుల మచ్చికతో కరివేముల గ్రామంలో నివాసం ఏర్పరుచుకుని, సాధారణ మనుషుల వలే జీవితాన్ని, బతుకు బండిని ముందుకు సాగించేందుకు వృత్తిని ఎంచుకుని ఈ భువిపై జన్మెత్తిన మహానుభావుడు...


మన కరివేముల గ్రామంలో ఇప్పుడున్న రంగావళి వంశ వృక్షంలో వన్నూరు తాత పాత్ర వటవృక్షం లాంటిదటా. అన్నదమ్ముల్లా పక్కపక్కనే నివాసముంటూ బతుకు పోరాటం కోసం లోకారెడ్డి తండ్రి లేక తండ్రి తండ్రి సంజీవరెడ్డి గారి ఇంట్లో పని(దాస్యము)కి చేరాడు. సంజీవరెడ్డి గారికి నమ్మిన వ్యక్తిగా ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగించే ఓ బాటసారి. సంజీవరెడ్డి గొప్ప పేరున్న భూస్వామి, అలాగే అప్పటి రాజులకు కూడా మంచి మిత్రుడు కావడంతో వారింట్లో పెద్ద పెద్ద గుర్రాలుండేడివటా. గుర్రాలంటే వన్నూరు తాతకు ఎనలేని ప్రేమటా... 


అలా సాగుతున్న రోజుల్లో ఒకానొక రోజు సంజీవరెడ్డి గారు కుటుంబ సమేతంగా రావిచెట్టు కింద కొలువైన శ్రీ శ్రీ శ్రీ ఉరుకుంద ఈరన్న సామి దర్శన నిమిత్తం గుర్రపు బండ్లను, ఎడ్లబండ్లను కట్టుకుని కామారం బయలుదేరారు. సంజీవరెడ్డి కుటుంబ సమేతంతో పాటుగా వన్నూరు తాత కూడా వెళ్లాడటా. సూర్యోదయం అవ్వకముందు బయలుదేరితే సూర్యాస్తమయానికి సమీపంలో చేరుకోగా ఉరుకుంద ఈరన్న సామిని చూసి వన్నూరు తాత వెకిలిగా ఓ నవ్వు విసిరాడటా. ఆ నవ్వులో అర్థం, పరమార్థం భగవంతుడుకే ఎరుక. ఆ నవ్వుకు శాపంగా వన్నూరు తాతకు పిచ్చిని ప్రసాదించాడు. అక్కడే దర్శనానికి వెళ్లిన రెడ్డి కుటుంబం ముందే వన్నూరు తాత పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం వలన అందరూ భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వన్నూరు తాతను మన గ్రామానికి తీసుకొచ్చారు...


వన్నూరు తాత శిష్యుడు పెద్ద పర్లయ్య. గురువు స్థానంలోనున్న వన్నూరు తాత వలే పెద్ద పర్లయ్య కూడా నిత్య బ్రహ్మచారి. శిష్యుడుని ముద్దుగా వన్నూరు తాత అనుమ అని పిలిచేవాడటా. వన్నూరు తాత ఒంటి మీద ముడ్డికి గోచి గుడ్డ, మెడమీద కంబళి, చేతిలో వెదురు కర్ర మాత్రమే ఉండేడిదటా... 


వన్నూరు తాతను తీరా ఉరుకుంద నుండి ఇంటికి తీసుకొచ్చాక తన మహిమల్నీ, శక్తుల్ని బయటపెట్టడం ప్రారంభించాడటా... 


మహిమలు, శక్తులు:-


ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రత్యక్షమవడం:- సంజీవరెడ్డి వన్నూరు పొలానికి వెళ్లమని చెప్పేలోగా అక్కడ ప్రత్యక్షమవడం, ఈ వన్నూరు సాయిబు ఇంకా ఇంటికి రాలేదే అని తలుచుకోగానే సంజీవరెడ్డి ముందు ప్రత్యక్షమవడం ఇలా... 


వడ్డించిన అన్నాన్ని ఆరగించకుండా మాయం చేయడం:-

 సాయిబుకి ఆ మట్టికుండలో బువ్వ ఓ మెడకలో పెట్టుకుని ఇచ్చిరా పెద్ద పర్లయ్య అని చెప్తే పెద్ద పర్లయ్య బువ్వ పెట్టుకుని, ముంత నిండా మంచినీళ్లు తీసుకుని వెళ్లి వన్నూరు తాత దగ్గరకు వెళ్తే పెద్ద పర్లయ్యను ముద్దుగా పిలుచుకునే అనుమ ఇక్కడ పెట్టి నువ్వు తిరిగి క్షణంలో ఇటు తిరగమని చెప్పి అంతా ఆరగించేశాను తీసుకెళ్లు అనుమ అనేటోడటా... 


మెడ మీద గొంగళితో వర్షాలు:- కొండమీదున్న చింతచెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ మెడమీద గొంగళి చేత్తో పట్టుకుని భీంకరంగా ఆకాశం వైపు చూసి నవ్వుతూ గొంగళిని ఇదిలిస్తే భారీ వర్షాలు కురిసేవటా... 


అగ్నిలో పడుకోవడం:- ఊరికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని తెలిసినా, విష జ్వరాల బారిన పడతారని తెలిసినా ముందుగానే పసిగట్టి అగ్నిలో కూర్చుండేవాడటా. ఏంటని అడిగితే ఊరికి సలిమంట ఏస్తున్నానని నవ్వుతూ అనేవాడటా... 


పాము కాటు విషాన్ని సేవించి పాము కాటుకు గురైన వారిని యదార్థస్థితికి తీసుకురావడం:-

ఓసారి వన్నూరు తాత శిష్యుడు పెద్ద పర్లయ్య ముద్దుగా అనుమ అని పిలుచుకునే వ్యక్తి పాముకాటుతో తల్లడిల్లుతూ వన్నూరు తాత దగ్గరకు చేరితే ముందుగానే పసిగట్టి అనుమ పాము కరిస్తే ఇంత ఆలస్యంగా వచ్చేది. తొందరగా విషం తీసేయాలంటూ పాము విషాన్ని తీసి యదార్థస్థితికి తీసుకువచ్చాడటా... 


పెద్దకూరాకునంతా పూలవనంగా మార్చడం:- సంజీవరెడ్డి భార్య రెడ్డమ్మ వన్నూరు సాయిబుకి పెద్దకూరాకు ఇష్టమని తెప్పిస్తే పెద్దకూరాకునంతా పూల వనంలా మార్చడం ఇలా మహిమగల్ల తాత ఎన్నెన్నో మహిమల్ని చూపి ఊరి జనాలకు అండగా ఉండి దేవుడయ్యాడు... 


సంజీవరెడ్డి ఇంటి నుండి రంగారెడ్డి ఇంటికి వెళ్లిన తర్వాత వన్నూరు స్వామి స్థానం, ఆస్థానం, ప్రస్థానం గురించి ఇప్పటి గ్రామ పెద్దలందరికీ చాలా మందికి తెలుసు. రంగారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వన్నూరు స్వామి అవతారం, మహిమల గురించి తెలుసుకోవాలనే తపన, ఆశక్తి, ఆతృత ఉన్న ఇప్పటి యువతరం తెలుసుకోండి. మున్ముందు తరాలకు మరింత తెలియజేయాలని మనసావాచ కోరుకుంటూ...


కరివేముల గ్రామంలో కొలువై భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమై నిలిచిన దేవా వన్నూరు స్వామి అందర్నీ చల్లగా చూసి, పాడిపంటలతో కలకలలాడుతూ ఉండేలా అందరిపై నీ చల్లని చూపు సమృద్ధిగా ఉండేలా, నీ ఆశీస్సులు మెండుగా ఉండేలా దీవించు తండ్రి... 🙏🙏🙏


శ్రీ శ్రీ శ్రీ హజరత్ వన్నూరు వలీ కి దోస్తరా ధిన్... 🙏

Comments

Popular posts from this blog

ఓ రోజు రాత్రి..!

"అన్నింటికన్నా ప్రమాదకరం" ఏంటంటే..!