పల్లెటూరి టేలర్..!
👉 చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఓ జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటూ రాశాను కాస్త ఓపిగ్గా చదవండి... 🙏
మనం చిన్నప్పుడు ఇబ్బంది పడుతూ లోలోనే కుమిలి ఎవరికీ చెప్పుకోలేని బాధల్లో ఒకటి కొత్త బట్టలు కుట్టించుకోవడం. ఒక అంగీ(చొక్కా), లాగు(నిక్కర్) కుట్టించుకోడానికి పడిన నానా తంటాలు...
మన ఊరి టేలర్ దగ్గర అంగీ, నిక్కర్ కుట్టించుకోవడంలో నా అనుభవం...
నా చిన్నప్పుడు ఊరి మొత్తానికి పేరున్న టేలర్ నన్నబుడ్డీ (నాకు మామ వరుస). పల్లెటూళ్లంటే తెలుసుగా ఏ కులం, మతం అంటూ పట్టింపులు లేకుండా కల్మషం లేకుండా బంధాలతో కలుపుకోవడం...
మా ఊరి మొత్తానికి మబ్దుల్ అనే ఒకతని దగ్గర బట్టల్ని కొనుగోలు చేసి నన్నబుడ్డీ అనే వ్యక్తి దగ్గర కుట్టించుకోవడం. మబ్దుల్ అనే పెద్దమనిషి మనుషుల రంగుల్ని బట్టి బట్టల రంగుల్ని కట్ చేసి ఇచ్చేవాడు. మనుషుల్ని దగ్గర చేసుకుని వ్యాపారం చేసుకోవడం ఈయన ఆనవాయితీ. మనుషుల్ని అసలు దూరం చేసుకోడు. డబ్బులు లేకపోయినా ఖాతాలో రాసుకుని గుడ్డలు ఇచ్చేటోడు. మనుషుల్ని ఆప్యాయంగా పలకరించడంలో మబ్దుల్ దిట్ట అనుకోండి. ఇప్పటికీ వారానికి రెండు సార్లు మన ఊరికి వచ్చి బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఈ బట్టలు చించిచ్చే మబ్దుల్ గారున్నారే భలే చమత్కారండోయ్...
ఇక టైలర్ నన్నబుడ్డీ దగ్గరకొస్తే ఒక చెవిలో నీలం రంగు పెన్ను, మరో చెవిలో ఎరుపు పెన్ను ఉంచుకుని మెడలో కండువా లాంటి పొడుగాటి టేప్ తగిల్చుకుని ఉండేటోడు. ఇక టేలరు నన్నబుడ్డీ మామ ఉన్నాడే ఈయన కొలతలు తీసుకోవడంలో సివిల్ ఇంజనీర్ కన్నా దిట్టనుకోండి. మబ్దుల్ దగ్గర చింపించుకున్న గుడ్డల్ని తీసుకుని టేలర్ దగ్గరకు వెళ్తే అక్కడ ఉండేవి మా చిన్నప్పటి పాట్లు...
ఓ వైపు అమ్మ, మరోవైపు నాన్న ఆ గుడ్డల్ని చేతిలట్టుకుని టేలర్ నన్నబుడ్డీ దగ్గర ఉండేవి అగసాట్లు. మనమేమో సైగల్ చేసేటోళ్లం అంగీ నడుం పైకి, లాగు అదేనండీ నిక్కర్ తొడల పైకి ఉండేలా అంటే అచ్చం చిన్న హీరోలా ఉండేటట్టు కుట్టమని ఏడుపు కళ్లతో చెప్పేటోడ్ని. టేలర్ నా మాట విన్నట్టుగానే నటిస్తూ మరోవైపు అమ్మ, నాన్న చెప్పే మాటల్ని వింటూ ఇగో టేలర్ మొన్న దసరాకు కుట్టిన బట్టలు ఉగాది వరకు కూడా రాలేదు. ఈసారైనా కాస్త పొడుగ్గా కుట్టు బట్ట కూలీ, కుట్టు కూలీ రెండూ దండగన్నట్లు కుట్టి ఇస్తే మాటిమాటికి పిల్లోడికి బట్టలు పట్టీయలేం కానీ నువ్వు మొన్న కుట్టిన బట్టలు అప్పుడే పైకి అయిపోయినాయి. ఈసారి చొక్కా అంగుళం నడుం కిందకు, లాగు మోకాలు కిందకు ఉండేటట్టు కుట్టమని వీళ్ల ఘోష వీళ్లది. ఏమైనా అంటే పిల్లాడు ఎదుగుతాడు అప్పుడే పైకి అయిపోతే ఎలా అని ఫేసులో క్వశ్చన్ మార్క్ ఒకటి...
ఈ టేలర్ కూడా మనం చెప్పేటప్పుడు మాత్రం నైసుగా నాకు తెలుసు లేరా ఇప్పుడున్న ఫ్యాషన్ తగ్గట్టుగా కుడతానంటాడు. మరో వైపు నాన్న చెప్పేలోగా టేపును రెండంగుళాలు కిందకు దించుతాడు. ఈ నడుం కొలతలు తీసుకునేటపుడు చూడాలి అగచాట్లు అదేదో మన నడుమును కూడా టేలర్ నడుమన్నట్లు టేపును పట్టి పట్టి కొలతలు తీసుకునుంటాడు. ఇక కొలతలు అయ్యాక ఓ ఆలోచన. ఈ టేలరు నేను చెప్పిన కొలతలు తీసుకున్నాడా లేక నాన్న చెప్పిన కొలతలు తీసుకుని చొక్కా, లాగును రీతి పాతి లేకుండా కుడతాడా అని ఒకటే తికమక అంటే నమ్మరు కానండీ. కొత్త బట్టలు చేతిలోకి వచ్చే వరకు ఏడుపొక్కటే తక్కువనుకోండి. నాకు కొత్త బట్టలు కావాలని మారం పెట్టుకుని భూమి మీద దుమ్మంతా శరీరానికి అంటుకునేలా పొర్లి పొర్లి ఏడ్చేటోడ్ని. కొలతలు అయ్యాక వారం రోజుల టైమ్ ఉంటుంది పండగకో, పబ్బానికో లేక బళ్లు తెరవడానికో...
కానీ, ఈ టేలరు ఉండేటోడండీ వారానికి వెళ్లి అడిగితే రేపంటాడు, మాపంటాడు, ఇంకో రెండు రోజులంటాడు, ఇంకో మూడు రోజులంటాడు, బట్టలు కుట్టడం అయ్యింది కానీ పోత పొయ్యలేదంటాడు. మరుసటి రోజు వెళ్తే పోత అయ్యింది కానీ ఇస్త్రీ అవ్వలేదంటాడు. ఇవ్వాళ నేను కొత్తబట్టలేసుకోవాలి యమర్జెంటన్నా వినడు ఈ టేలరు. ఎందుకంటే ఊరి మొత్తం బట్టలు ఈయనొక్కడే కుట్టాలి. మనకేమో కొత్త బట్టలు అప్పుడు ఏసుకోమా, ఇప్పుడు ఏసుకోమా అనే ఉత్సాహం. ఈ టేలరు దగ్గరకు తిరిగి తిరిగి కాళ్లు కూడా కాస్తో కూస్తో అరిగిపోయేవనుకోండి. కానీ టేలరు మాత్రం బట్టలు రైట్ టైమ్ కి ఇచ్చేవాడు కాదండోయ్. ఇలా ఒక నెల రోజుల టైమ్ దొబ్బేస్తూ కొత్త బట్టలు తొడుగుదామనే మూడు, ఉత్సాహం సర్వనాశనం అనుకోండి...
చివరకు ఆ కొత్త బట్టలేవో మన చేతిలోకి వచ్చి పొద్దుగాళ్ల నీళ్లు బోసుకుని బట్టలు వేసుకుంటుంటే చూడండి చొక్కానేమో మోకాలు వరకు, ఆ లాగేమో ప్యాంట్ కి తక్కువ, లాగుకి ఎక్కువ. ఏమైనా అంటే ఎదిగే పిల్లోడివి ఇట్లుంటేనే చక్కగా కనిపిస్తావని టేలరుకి తగ్గట్టుగా ఇంట్లో వాళ్ల దొబ్బులాట.
అద్గద్దీ ఏదీ ఏమైనా కొత్త బట్టలు ఏసుకున్నామనే సంతోషం ఓ వైపు ఉన్నా టేలరు సరిగా కుట్టలేదన్న బాధ రెట్టింపు ఉండేది...
ఆ కొత్త బట్టలు ఏసుకుంటే ఎట్లుండేడిదంటే చొక్కా దక్షిణం వైపు వేలాడితే, లాగు అదేనండీ నిక్కరు ఉత్తరం వైపు వేలాడేదంటే నమ్మరనుకోండి. వాటిని రెండు చేతులతో సరిచేసుకుంటూ పట్టుకోవడమే సరిపోయేది. కానీ, టేలరు పగలు, రాత్రి కష్టపడి కుట్టి మన చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఆ టేలరు కళ్ల వైపు చూడాలి హమ్మయ్య ఒకడి బాధ్యత తెగిపోయిందనే ఆయన ఆలోచనకు నిజంగా అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఆయన మన కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోతాడు. ఒక్కసారి కొత్త బట్టలేసుకుని టేలరు కళ్లముందు కనిపించాలి మన కన్నా రెట్టింపు ఆనందం ఆయన కళ్ళల్లో చూడొచ్చు. ఏదిఏమైనా మనకు చొక్కా, లాగు సరిగా కుట్టలేదనే నిరాశ ఉన్నా ఈసారైనా కూసింత రెండు అంగుళాల పొడవు తగ్గించి పైకి కుట్టాలన్న ఆశను మేల్కొల్పుకునేవాడే ఈ టేలరు...
లాంగూలం గాళ్ళకి లాగులతో పనేంటి అని కసురుకున్నా,
నువ్వు ఆ లాగు తొడగనిదే దేశమంతా ఊరేగవని నొక్కుకున్నా,
మత్పీఠమునకు లాగులు తొడొక్కోవడం కూడా ఓ చిన్ని ఆనందమంటే నమ్మరుకానండీ...
తిరిగి రాని నిక్కర్ల రోజులు, నిక్కర్లకలవాటుపడిపోయి ఎదిగిన తర్వాత ప్యాంటులేసుకోవాలంటే సిగ్గుపడిపోయిన జీవితాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి టేలరు దగ్గర అనుభవం నాది...
కల్మషం లేని స్వచ్ఛమైన నవ్వును కల్గిన ఈ టేలరు "నన్నబుడ్డీ" మామ మన మధ్య లేక స్వర్గాన చేరి శానా ఏళ్లయ్యిందనుకోండి. మళ్లీ పుట్టి ఈ తరం పిల్లకాయలకు చొక్కా, లాగులను ఈనాటి ఫ్యాషనుకు తగ్గట్టుగా కుట్టాలని, ఎప్పటిలాగానే రైట్ టైమ్ కి బట్టలు ఇవ్వకుండా తిప్పి తిప్పి కొత్త బట్టలు వేసుకోవాలనే రెట్టింపు ఉత్సాహం మేల్కొల్పాలని ఆశిస్తూ...
టేలర్ నన్నబుడ్డీ మామ మీద ప్రేమతో అతని దగ్గర చొక్కా, లాగు కుట్టించుకున్న నా అనుభవం మీ అందరి కోసం... ✍️
ఓపిగ్గా మొత్తం చదివిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు...🙏
మీ,
వన్నూరప్ప... ✍️

Comments
Post a Comment