క్షరకుడి చేతిలో నా అగచాట్లు..!

 అందరికీ హృదయపూర్వక నమస్తే... 🙏



    మన పుట్టెంట్రుకలు తీసే దగ్గర్నుంచి, పాడెక్కే వరకు ప్రతి ఒక్కరికీ తలవెంట్రుకలు పెరిగితే అదేనండీ కట్టింగ్ పెరిగితే మంగళి షాపుకెళ్లి కట్టింగ్ చేయించుకునేటప్పుడు పడే తంటాలేంటో అందులో నేను పడిన ఘోషేంటో మీకు చెప్దామని వచ్చానండోయ్...


మాదొక గ్రామం, పేరు కరివేముల(కర్నూలు జిల్లాలో ఓ గ్రామం). ఏం చూసి ఊరి పేరు కరివేముల అని పెట్టారో తెలీదు కానండీ మా ఊరికి మాత్రం ఏనుగులంతటి బలముండేడిదటా. ఓసారి కూసింత ఎనక్కెళ్లి మా ఊరి పేరులోని ముందు రెండు అక్షరాలను గమనించండి మీకే అర్ధమవుతుంది ఎంచ్చక్కా...


ఇక అసలు విషయానికొస్తే మా ఊళ్లో నాయి బ్రాహ్మణుల(మంగళొళ్ల) దండు పెద్దదేనండోయ్. ఆరుగురో, ఏడుగురో అందరూ అన్నదమ్ముల వరుసైనా, ఇద్దరేమో ఆడపిల్ల కొడుకులుండబట్టి ఊళ్లోనే అలా వరుసైన వాళ్లు కూడా రెండు కుటుంబాలున్నాయన్నమాట. ఇలా వాళ్లు, వాళ్లవాళ్ల బిడ్డలు ఇలా చాలా గుంపే ఉంది...



ఈ నాయీ బ్రాహ్మణులు మాత్రం సన్నాయి, డోలు వాయిస్తూ మా ఊరికి మంచి పేరే తీసుకొచ్చారనుకోండి. సన్నాయి, డోలు మాత్రమే కాదండోయ్. క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఆయుర్వేద శాస్త్రానికి శుశృతుడు గుండెకాయ అయితే చరతుడు వెన్నెముక లాంటోళ్లని సదువుకున్నాం మీకు గుర్తుందో లేదో కానీ ఈ నాయి బ్రాహ్మణులు వైద్యం అందించడంలో సుప్రసిద్ధులు. మా ఊళ్లోని మంగళొళ్లలో మూగ జీవాలకు వైద్యం చేసేటోళ్లు కూడా ఉన్నారు వీళ్లలో. పశువులకు గాలి సోకినా, మేత తినక పోయినా కర్రతో వైద్యం చేసి మూడు రోజుల్లో పశువులు మేత తినేలా చేయగల గొప్ప వైద్యులు కూడా ఉన్నారండోయ్. కాకపోతే వట్టి పిసినారులు. రూపాయి కూడా ఖర్సు సేయరు, వచ్చేవీ వదలరనుకోండి అదేరే విషయం. కాకపోతే మనుషులు మాత్రం కడిగిన ముత్యాలాంటోళ్లు. ఆ మాటల్లోని ఆప్యాయత, అనురాగం, ప్రేమకు కొదువలేదనుకోండి...


ఇకపోతే ఈ మంగళొళ్లు ఒక్కో కుటుంబం మా ఊర్లోని ఐదారేసి ఇళ్లను పట్టుకుని బ్యాండ్ తో వాళ్లలో ఐక్యంగా గ్రూపుగా ఏర్పడి వాళ్లట్టుకున్న ఇంట్లో పెళ్లిళ్లకు, చావు కార్యాలకు మేళం వాయించడం, క్షవరాలు చేయడం ఇలా వాళ్లు పట్టుకున్న కుటుంబాలకు మాత్రమే సంవత్సరానికి ఇంత ఆయం అంటూ తీసుకుని క్షవరాలు చేసేవారు. పెళ్లిళ్లు చేస్తే ఇంటి మంగలోళ్లకి ఆయంతో పాటు ధాన్యం ఇవ్వడం, కొత్త బట్టలు పెట్టడం, గోవుల్ని దానమివ్వడం ఇలా ఉండేడిదన్నమాట. నేను చూసిందయితే ఈ దానాలు మాత్రమే కానీ అప్పట్లో పెద్దలు ఇంటి మంగలోళ్లకి గుప్త దానాలు కూడా ఇచ్చారని విన్నాను కానీ పూర్తిగా తెలీదనుకోండి... 


ఇక వాళ్ల సన్నాయి మనమూది, వాళ్ల డోలు మనం కొట్టడం ముగించుకుని మన క్షవరం దగ్గరకొస్తే మంగలోళ్లతో క్షవరం పూర్తయ్యే వరకు ఉండే ఘోష అంతా ఇంతా కాదండోయ్. చెప్తా పటు ఇనుర్రి...


నేను అమ్మ, నాన్నకు పెళ్లైన మూడు సంవత్సరాలకు మా ఊరి దేవుడు వన్నూర్ తాతకు మొక్కుకుంటే పుట్టానట. అందుకే నా పేరు వన్నూరప్ప అని పెట్టారు. ఆ భగవంతుడు పేరు పెట్టుకున్నా కానీ నా జీవితంలో ఆహా అని అనుకున్న రోజు ఇప్పటికీ లేదంటే నమ్మరనుకోండీ. నేను పుట్టానని మూడేళ్లకేమో వన్నూర్ తాతకు మొక్కుబడిగా నాకు తలనీలాలు తీయించాలని బంధువులందర్నీ పిలిచి పెద్ద పొట్టేల్ని చేశారు. ఇక అంతా రెడీ అయ్యింది. వన్నూర్ తాత గుడి దగ్గర నా తలనీలాల కార్యక్రమం స్టార్టూ. ఇక మా ఇంటి మంగలాయన పేరు మంగళి గుండ్రాయి అలియాస్ చిన్న వెంకట్రాముడు(వరుసకు మామ). పేరులోనే ఉంది చూడండి మీరు ఊహించుకునేదంతా. కానీ మనిషి వెన్న లాంటోడు. కరిగేది తక్కువైనా అందర్నీ కరిగించి కొరిగించేస్తాడు. అక్కడ మొదలైందండీ నా ఏడుపు ఇప్పటికీ ఆగలేదనుకోండి క్షవరం చేసినప్పుడల్లా...


మా ఇంటికొచ్చే క్షవరం చేసేవారు. ఒకసారి క్షవరం చేస్తే మూడు నెలల పాటు గడప తొక్కేవారు కాదు. ఇంటికొచ్చినప్పుడు మాత్రం ఇంట్లో మగోళ్లందరికీ నున్నగా క్షవరమే అప్పట్లో ప్యాషనూ, గీషనేమీలేదండోయ్. ఒకటే ప్యాషనూ సిప్ప కట్టింగ్. ఆ కట్సేమో దవడెముకలు కనిపించేలా చెవిపైకీనూ...


కొన్ని సంవత్సరాలయ్యాక ఇంటికొచ్చి క్షవరం చేయడం మానేశారనుకోండి. క్షవరం చేయించుకోవాలంటే మనమే వాళ్లింటికెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ ఇంటికెళ్తే అక్కడ వాళ్లుండరు ఏదో పని మీద బయటకెళ్లుంటారు. క్షవరం చేయించుకుందామనే ఆశతో వెళ్తే నిరాశతో తిరిగి ఇంటికొచ్చిన రోజులు కూడా ఉన్నాయండోయ్. 


తమ వృత్తితో (సంగీతమేళం, బ్యాండు వాయించి, అలాగే క్షౌర వృత్తితో) పైసా పైసా కూడబెట్టుకుని బాగా సంపాదించుకున్నారు. ఇంకాసిన్ని సంవత్సరాలయ్యాక ఆ ఇంటికెళ్లి క్షవరం చేయించుకోవడం కూడా ఆగిపోయి ఏకంగా షాపుకెళ్లి చేయించుకోవడం వరకొచ్చింది. కాలమేమీ మారలేదు కానీ మనుషులు, మనుషుల ప్రేమలు, పలకరింపులు మాత్రమే మారిపోయాయండోయ్. ఇగ క్షవరం చేయించుకోడానికెళ్తే ఉండేదండీ ఆ షాపులో... 



ఊరికి ఉన్నదీ ఒకే బార్బర్ షాపు. తండ్రీకొడుకులిద్దరునూ వచ్చినొళ్లకి క్షవరం చేసేటోళ్లు. కొత్తగా పెట్టిన షాపు అందులో ఊరికున్నది ఒకే షాపు గనుక చాలా మందే వచ్చేటోళ్లు క్షవరం చేయించుకోటానికి, పెద్ద పెద్ద అద్దాల్లో రూపం సూసుకుని మురిసిపోడానికి. ఎందరొచ్చిన క్షవరం చేసేటప్పుడు మంగలోడు మాత్రమే మాట్లాడాలి. కాదుకూడదని మాట్లాడటానికి ప్రయత్నించావా..! 

క్షౌరశాలకి వెళ్లినప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలనే సామెత గుర్తుందో లేదో మీకు మరీ... 

ఈ సామెత ఎందుకొచ్చిందంటే చెప్తా పటు ఇనుర్రి... 

పూర్వం రోజుల్లో క్షౌరం వృత్తి చేసే మహాపద్మనందుడు అనే క్షరకుడిని శిశునాగ వంశానికి చెందిన రాజుకు క్షవరం చేసే సమయంలో అవమానకరముగా క్షరకుడా (మంగలోడా) అని అవమానించేవాడట. ఆ అవమానము తాళలేక ఒకరోజు మహాపద్మనందుడు క్షవరం చేసే కత్తితోనే ఆ రాజును సంహరిస్తాడు. ఆ తర్వాత అఖిల భారతవనిని ఆక్రమించుకొని నంద రాజ్యాన్ని స్థాపించి పాలిస్తాడు. అంచేతనే క్షౌరశాలకి వెళ్లినప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఎక్కువగా మాట్లాడకూడదని అంటారు... 


చిన్నవయసులో కాబట్టి గుండ్రాయి తాతతో క్షవరం చేయించుకునేవాడిని. పెరిగి పెద్దయ్యాక ఆ సిప్ప కట్టింగ్ కి ముగింపు పలికి గుండ్రాయి తాత పెద్ద కొడుకు చిన్నరామప్ప మామతో క్షవరం చేయించుకోవడం మొదలైంది. ఇక షాపుకి వెళ్తే ఉండేదండీ నా తిప్పలు. ఎంత ముందెళ్లి కూసున్నా పెద్దొళ్లందరికీ చేసేదయ్యే వరకు నాకు చేసేవారు కాదు. ఓపిగ్గా కూసుని క్షవరం చేయించుకోవాలి. లేదంటే క్షవరం చేసేటప్పుడు సుక్కలే. మనం చెప్పినట్లు చేయడు కాస్త ఓపిగ్గా కూసుని ఏ పవన్ కళ్యాణ్ స్టైలో లేక అప్పట్లో ఫేమస్ గనుక అబ్బాస్ స్టైల్లోనో చేయించుకుందామనే ఆశతో కూడిన ఉత్సాహం. తీరా వెళ్లి కుర్సీలో కూసుని క్షవరానికి సిద్ధమయ్యామా ఓ చేత్తో ఆ మొద్దు బారి సిలుము (తుప్పు) పట్టిన కత్తెరట్టుకుని, మరో చేత్తో పండ్లూసిపోయిన దువ్వెనట్టుకుని మొదలెడతాడండీ నా సామి రంగా తలకాయ ఒంపి ఒంపి ఉన్న జుట్టు కట్ చేసి మెడ నొప్పులే వస్తాయంటే నమ్మరనుకోండి. కత్తెరతో కట్ చేయడం అయ్యాక కత్తికి నీళ్లు కొట్టి బ్లేడుని అందులేసి(కత్తిలో బ్లేడేసటప్పుడు చూస్తే కొత్త బ్లేడండోయ్) పట్టి మెడలు, కడతల చివర్లు గీరితే ఉంటుందండీ చర్మమంతా ఎర్రగై రక్తం కారిపోవాలే. తర్వాత వెంట్రుకలు దులిపే బ్రష్ తీసుకుని మీదున్న వెంట్రుకలు దులిపి, ఐసు ముక్కతో గడ్డం, మెడ మీద తిక్కి, సింతాల్ పౌడరేసీ, పండ్లూసిన దువ్వెనకున్న వెంట్రుకల్ని కింద కొట్టి దువ్వుకోమని చేతికిచ్చి చేసిందంతయ్యాక ఇంతకు మునుపే బాగున్న వెంట్రుకల్ని కోల్పోయామనే ఆ ఉత్సాహం కూసింత నిరుత్సాహమయ్యేది... 


ఎనిమిది సంవత్సరాలుగా జీవత్సవంలా మంచానికే ఉన్నా తన పనులన్నీ ఒదులుకుని పిలిచిన రెండు, మూడ్రోజులకైనా నాకోసం ఇంటికొచ్చి క్షవరం చేసే చిన్నరామప్ప మామకు నా హృదయపూర్వక ప్రేమ... ❤️


ఏదిఏమైనా మాసిపోయి మసిబొగ్గులా మారిన ముఖానికి, పీచెంట్రుకల్లా తయారైన మన తల వెంట్రుకలకి, గడ్డానికున్న వెంట్రుకలకి తన కళతో అదేనండీ కత్తితో కొత్త అందాలను దిద్దే ప్రతి క్షరకుడికి నా హృదయపూర్వక వందనాలు... 🙏

                                      ప్రేమతో, 

                                         మీ, 

                                వన్నూరప్ప... ✍️🙏

Comments

Popular posts from this blog

మా గొప్ప దేవుడు

ఓ రోజు రాత్రి..!

"అన్నింటికన్నా ప్రమాదకరం" ఏంటంటే..!